థర్డ్ జెండర్ (హిజ్రా)

చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు .....
హిజ్రాలు ఎలా తయారవుతారు?
హిజ్రాల్లో కొంతమంది ఆడవాళ్లున్నప్పటికీ, చాలామంది మాత్రం గతజీవితంలో మగాళ్లే. ఆడవారిలా మారాలన్న కోరిక, హిజ్రాలుగా మారడానికి పురికొల్పుతుంది. చిన్నప్పటినుంచే అవకాశం వచ్చినప్పుడల్లా ఆడవారిలా అలంకరించుకుంటూ.. ఆడవాళ్ల దుస్తులు వేసుకుంటూ సంబరపడే వాళ్లు.. ఓ దశకు చేరిన తర్వాత పూర్తి స్థాయిలో రూపు మార్చుకోవాలనుకుంటారు.
 హిజ్రాలుగా మారతామంటూ ఎంతోమంది వీరిదగ్గరకు వస్తుంటారు. ఇలా వచ్చినవారందరినీ మార్చరు. కనీసం ఏడాది పాటు వారిని తమతో పాటే ఉంచుకొని పరీక్షిస్తారు. పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత, సెక్స్‌ఛేంజ్ ఆపరేషన్ చేయిస్తారు. ఇవి ఎక్కువగా విజయవాడ, కర్నూలు, ముంబై, ఢిల్లీల్లో జరుగుతుంటాయి. ఆడతనం తెచ్చుకోవడం కోసం, పుట్టుకతో వచ్చిన అవయవాలను వదులుకుంటారు. ఇదంతా రహస్యంగా జరుగుతుంది. ఈ ఆపరేషన్ జరిగిన 41 రోజులకు జల్సా పండుగ జరుగుతుంది. పూర్తిస్థాయి హిజ్రా మారే సందర్భంలో చేసుకునే పండగ ఇది.
 ఆ మరుసటి రోజు తెల్లవారుఝామునే అసలు కార్యక్రమం మొదలవుతుంది. చెప్పాలంటే.. ఓ పెళ్లి తంతులా అత్యంత ఘనంగా దీన్ని నిర్వహిస్తారు. హిజ్రాగా మారే వ్యక్తికి పసుపురాసి, దిష్టితీస్తారు. ఆతర్వాత అభ్యంగన స్నానం చేయించి.. ఆకుపచ్చచీర కట్టి ముస్తాబు చేస్తారు.
ముఖాన్ని ఎవరూ చూడకుండా, చీరకొంగుతో కప్పుతారు. వీరి ఆరాధ్యదైవమైన మురిగిమాత వద్ద ఉంచిన పాలముంతను తెచ్చి, వీరి తలపై పెడతారు. ఊరేగింపుగా తీసుకెళ్లి... వాగులో పాలను పోయిస్తారు. ఇక్కడితో మొదటి అంకం పూర్తవుతుంది. తిరిగి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేస్తారు. రిసెప్షన్ కోసం అంతా సిద్దమవుతుంది. మురిగిమాత చిత్రపటం ముందు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. హిజ్రాగా మారిన వారి మెడలో , వారిని మార్చిన వారు తాళి కడతారు. ఇలా తాళికట్టే ఆమెను అత్తగా భావిస్తారు. ఈమెదే పెత్తనమంతా. ఈ కార్యక్రమంతో పూర్తిస్థాయి హిజ్రాగా మారిపోతారు. ఇక ఆ తర్వాతంతా సంబరాలే. పాటలు పెట్టుకుని, డ్యాన్స్‌లు చేస్తూ.. ఈ లోకాన్ని మర్చిపోతారు. ఈ రోజును జీవితంలో మర్చిపోలేని రోజుగా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.
హిజ్రాలుగా మారిన వారు.. మారుతున్న వారు.. మారబోయే వారు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. మనసుకు నచ్చినట్లుగా ఉండడం కోసం.. వీరు అందరితోనూ పోరాటం చేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ అయినవారే కానివారుగా మారిపోతారు. సొంతకుటుంబమే వారిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. నీదారి నువ్వు చూసుకో అంటుంది. వారితో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటుంది. కానీ, ఈ బంధాలు, అనుబంధాలను తెంచుకొని.. మనసుకు నచ్చినట్లుగా జీవించడానికి గడపదాటతారు. తమలాంటి వారితో కొత్త బంధాలను సృష్టించుకుంటారు. హిజ్రాగా జీవితం సాఫీగా సాగితే.. తమ ఆరాధ్యదైవం మురిగి మాతకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడేళ్లకు, ఐదేళ్లకు, పన్నెండేళ్లలో ఏదో ఓ సారి తిరుగుపూజ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తమను ఇలానే చల్లగా చూడమంటూ కోరుకుంటారు. ఆ తర్వాత రిసెప్షన్‌ను నిర్వహిస్తారు. ఆటపాటలతో అంతాకలిసి సందడిసందడిగా గడుపుతారు.

హిజ్రాల రూపంలో బహురూపులు
అన్ని అడ్డంకులనూ ఎదురిస్తూ.. ఏ మాత్రం గుర్తింపులేని థర్డ్‌జెండర్‌గా జీవనప్రయాణాన్ని సాగిస్తున్న వీరికి మాయగాళ్లతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా.. బహురూపులతో సమస్యలు వస్తున్నాయి. ఈ బహురూపులు మగాళ్లే అయినప్పటికీ హిజ్రాల వేషంతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. హిజ్రాల వేషంలో దొంగతనాలకూ పాల్పడుతున్నారు. చేసేది వీరైనా.. అపవాదు మాత్రం అసలు హిజ్రాలపైనే పడుతోంది. బయట రోడ్లపై కనిపించే వారిలో సగానికి సగం మంది అసలైన హిజ్రాలు కాదు. కానీ, వీరిని గుర్తించడం ఎలా..? ఇదే అసలు సమస్య.
గుర్తింపు కోసం పోరాటం
జీవితంతో పోరాడుతున్న హిజ్రాలు.. ఇప్పుడు గుర్తింపు కోసం పోరాటం మొదలుపెట్టారు. దక్షిణాదితో పోల్చితే ఉత్తర భారతంలో హిజ్రాలకు సముచిత గౌరవమే లభిస్తోంది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వీరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక మన పక్కనే ఉన్న తమిళనాడులోనూ ప్రత్కేక గుర్తింపు ఉంది. వీరికోసం ప్రత్యేకంగా అన్నిచోట్లా T అన్న కాలమ్‌ను ఏర్పాటు చేసింది. స్త్రీపురుషులతో సమానంగా ట్రాన్స్‌జెండర్స్‌ను గుర్తిస్తోంది. కానీ.. మన దగ్గర మాత్రం ఇలాంటి స్పెషల్ ఐడెంటిటీ లేదు. మనుషుల్లో వీరినో వర్గంగానే గుర్తించరు. ఈ పరిస్థితే మారాలంటున్నారు హిజ్రాలు.
ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవిస్తున్న హిజ్రాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. చదువుతోనే జీవితాలను చక్కదిద్దుకోవచ్చన్న విషయాన్ని గ్రహించి అటువైపు దృష్టి సారించారు. డిస్టేన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకుంటూ డిగ్రీలు సంపాదిస్తున్నారు. వీరిలో కొంతమంది పీజీలు చేయగా.. మరికొంతమంది డిగ్రీ పూర్తిచేశారు. వీలైనంతవరకూ యాచకవృత్తికి దూరమై ఉద్యోగాలు చేస్తూ.. జీవితాన్ని సాగించాలనే ధృక్పథం క్రమంగా పెరుగుతోంది. తమ హక్కుల కోసం పోరాడటానికీ సిద్ధమవుతున్నారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి సాయపడుతూ.. ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. వీరిలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి. రూపాన్ని మార్చుకోవాలన్న వీరి నిర్ణయాన్ని అంగీకరించలేక, దూరమైన కుటుంబ సభ్యులు.. ఇప్పుడిప్పుడే మనసు మార్చుకుంటున్నారు. క్రమంగా వీరికి దగ్గరవుతున్నారు. మళ్లీ కుటుంబంలో కలుపుకుంటున్నారు. కానీ, కుటుంబం ఒక్కటీ మారితే సరిపోదు. ఈ సమాజమూ మారాలి. మనుషులంతా వీరిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. అందుకే.. అందరికీ వీరు చేసే విజ్ఞప్తి ఒక్కటే. తమనూ మనుషులుగా గుర్తించమనే.


Comments