గుంటూరు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాల అరాచకాలు

ఫ్యాక్టరీలకు భూములిస్తే ఉపాధి లభిస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ ఫ్యాక్టరీల నెపంతో భూములు కొల్లగొడుతున్నారని ఊహించలేకపోయారు. తమ జీవనాధారమైన భూములు దక్కించుకోవాలని చూసిన రైతులపై యాజమాన్యం దాడులకు దిగింది. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం...ఫ్యాక్టరీ లీజును రద్దు చేసింది.
 గుంటూరు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. 2007లో మాచవరం జిల్లా చెన్నాయపాలెంలో లీజు అనుమతులు పొందిన సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ...440 ఎకరాల భూములను స్థానిక రైతుల నుంచి సేకరించింది. ఫ్యాక్టరీ కట్టకపోవడంతో  మోసం గ్రహించిన రైతులు తిరగబడి భూముల్లో పంట సాగు చేపట్టారు. యాజమాన్యంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో కలిసి రైతులపై దాడికి దిగారు. బాంబులు కత్తులతో బెదిరిస్తూ వీరంగం సృష్టించారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
  
ఘటనపై ఏపీ సర్కారు ఆలస్యంగా స్పందించింది. మంత్రి పత్తిపాటి పుల్లారావు కలెక్టర్ తో కలిసి చెన్నాయపాలెం వెళ్లి రైతులను పరామర్శించారు. ఫ్యాక్టరీ లీజు రద్దు చేసి...దాడికి పాల్పడిన 200 మందిపై కేసులు నమోదు చేసినట్లు మంత్రి ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో ఒక్క సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీనే కాదు..అనేక కంపెనీలు...రైతులను భూములు సేకరించి...ఇతర సంస్థలకు అమ్ముకోవడమో.. బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాల పేరుతో డబ్బు దండుకోవడమో చేశాయి. ఫ్యాక్టరీలకు భూములిచ్చిన రైతులు...ఇప్పుడు కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలపై...తక్షణం చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Comments