kadapa

కడప జిల్లా అంటే ప్యాక్షనిజమే కాదు


కడప జిల్లా పేరు చెబితే ఫ్యాక్షనిజం గుర్తొస్తుంది. కానీ, జిల్లాలో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలున్నాయిహిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ద, జైన పుణ్య క్షేత్రాలెన్నో కడప జిల్లా నలుమూలలా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతుంటాయి
తెలుగు నేల మీద రెండవ భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయం వున్నది కడప జిల్లాలోనే. వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఒంటిమిట్ట ప్రాంతంలో సంచరించారన్నది స్థల పురాణం. దేవాలయంలోని శిల్ప సంపద చూపరుల మనస్సు దోచుకుంటుంది.
కడప జిల్లాలో మరో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పుష్పగిరి పీఠం. పెన్నానది పక్కనే వున్న పీఠానికి వందల ఏళ్ల చరిత్ర వుంది. గతంలో ఇక్కడ నూరు శివలింగాలు వుండేవని చెబుతుంటారు. కార్తీక మాసంలో భక్తులు భారీగా వస్తుంటారు.
చక్రయపేట మండలంలోని  గండిక్షేత్రం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఒక రాతిపై గీసిన ఆంజనేయుని రూపం విశేషంగా ఆకర్షిస్తుంది శ్రీరాముడే బాణంతో రూపం గీశాడని స్థల పురాణం చెబుతోంది. రెండు కొండల మధ్య పాపఘ్నినది పారుతుండడం వల్ల క్షేత్రానికి గండి క్షేత్రమనే పేరు వచ్చింది.
తిరుమల వెంకన్నస్వామికి తొలి గడపగా పేరొందిన దేవుని కడప భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. తిరుమలకు వెళ్లలేనివారు దేవుని గడపలోని  లక్ష్మీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని త్రుప్తి చెందేవారు. దేవాలయంలో హిందూ ముస్లిం ఐక్యత ఉట్టిపడుతుంది. వెంకటేశ్వరుడి ఇద్దరు భార్యలలో ఒకరైన బీబీ నాంచారిని ముస్లింగా పేర్కొంటారుబీబీ నాంచారిని పెళ్లాడిన వెంకటేశ్వరుడికి ముస్లింలు కూడా టెంకాయలు కొట్టి పూజించడం విశేషం.
నందలూరు సోమనాధేశ్వరాలయం, మైలవరం మండలంలోని అగస్తేశ్వర కోన, కాశినాయన జ్యోతి క్షేత్రం తో పాటు మరికొన్ని ఆలయాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.
కడప జిల్లాలోని పెద్ద దర్గా  జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పాటు ఎందరో సెలబ్రిటీలు  పెద్ద దర్గాను దర్శించుకుంటారు. పెద్ద దర్గా పీఠాధిపతి అరిఫుల్లా హుస్సేని దీవెనల కోసం దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. హిందూ ముస్లిం ఐక్యతకు దర్గా చిరునామాగా మారింది.
కడప జిల్లాలోని కలసపాడు చర్చికి ఎంతో విశిష్టత వుంది. క్రైస్తవులతో పాటు ఇతర మతాలవారు కూడా ఇక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. 1887లో నిర్మితమైన చర్చి వారసత్వ సంపదగా విరాజిల్లుతోంది. ఇక్కడ జరిగే తిరునాళ్లకు పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.
 వనవాసకాలంలో రాముడు వంటిమిట్టను దర్శించాడని ప్రతీతి
గండిక్షేత్రంలో ఆంజనేయ రూపాన్ని రాముడే చిత్రించాడని స్థలపురాణం
హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలుగా దేవుని కడప, పెద్ద దర్గా
1887లో నిర్మితమైన కలసపాడు

Comments