ఇంటిపేరు ఎలా వచ్చింది............?

ఇంటిపేరు (లేదా గృహనామం) సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషి గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది.
పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము. మనుషులను మరింత ప్రత్యేకంగా గురించటానికి, లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. ఈ మధ్యనే కావించిన ఒక పరిశోధనలో డాల్ఫినులు కూడా తమని తాము పేర్లతో పిలుచుకుంటాయని అవి ఈలల రూపంలో ఉంటాయని తెలుసుకున్నారు.[1] ఈ వ్యాసంలోని మిగతా భాగము మనుషుల పేర్లు ఇంటి పేర్లు గురించి వివరిస్తూ ఉంటుంది.
చరిత్ర
పూర్వ కాలంలో ప్రజలకి పేర్లే ఉండేవి; ఇంటి పేర్లు ఉండేవి కావు. వ్యాసుల వారు, కృష్ణుడు, అర్జునుడు, అశోకుడు, శంకరాచార్యులు, మొదలయిన వారు ఈ కోవకి చెందుతారు. వేదాలని నాలుగు భాగాలుగా విడగొట్టి, వాటిని ఏ విధంగా పఠించాలో సూచించేరు కనుక వ్యాసున్ని వేదవ్యాసుడు అన్నాం. శంకరాచార్యులు స్థాపించిన పీఠాధిపతులందరినీ శంకరాచార్యులు అనే పిలవడం మొదలు పెట్టేము కనుక మొట్టమొదటి శంకరాచార్యులవారిని ఆదిశంకరాచార్యులు అన్నాం. ఆ రోజులలో ఈ “వేద”, “ఆది” అన్న మాటలు గౌరవార్థకాలయిన విశేషణాలే కాని ఇంటిపేర్లుగా చెలామణీ అవలేదు.
క్రమేపీ పేరు ఒక్కటే వాడితే ఎవరు ఎవరో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయాయి. ఈ పరిస్థితి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకి, నార్మనులు క్రీ. శ. 1066 లో దండెత్తి ఇంగ్లండుని ఆక్రమించిన తర్వాత అక్కడ ఇంటి పేర్ల వాడకం వ్యాప్తి లోకి వచ్చింది. ఉదాహరణకి, ఎలైజా అనే పేరింటిగత్తెలు ఎంతో మంది ఉండొచ్చు. ఫలానా ఎలైజాని గురించి ఎలా వాకబు చెయ్యడం? బద్ధకిష్టి ఎలైజా అనో, తినమరిగిన ఎలైజా అనో, పనిదొంగ ఎలైజా అనో చెప్పాలి కదా. కనుక ఇంగ్లీషులో “ఎలైజా డు లిటిల్‌” అని ఉంటారు. అదే క్రమేపీ ఎలైజా డులిటిల్‌గా మారింది.
ఇలాగే విలియమ్‌ అనే ఆసామి కొడుకు జాన్‌ ఉన్నాడనుకుందాం. వాడు మన ఎలైజాలా బద్ధకిష్టి బడుద్ధాయి కాడు. అటువంటప్పుడు వాడిని “విలియమ్‌ కొడుకు జాన్‌” అని పిలవచ్చు. ఇంగ్లీషు భాషా సంప్రదాయం ప్రకారం, ఈ విషయాన్ని “జాన్‌, విలియమ్స్‌ సన్‌” అని అనొచ్చు. అదే “జాన్‌ విలియమ్‌సన్‌” గానూ, తర్వాత “జాన్‌ విలియమ్స్‌” గానూ మారి ఉంటుంది.
వృత్తి పేరుని ఇంటిపేరుగా వాడే అలవాటు చాల దేశాలలో ఉంది. చాకలి సోమయ్య, మంగలి వెంకన్న మొదలయిన మాటలు వాడుకలో ఉన్నా తెలుగుదేశంలో ఈ పద్ధతి అంత ఎక్కువగా లేదు. ఉత్తర భారతదేశం లోనూ, పాశ్చాత్య దేశాలలోనూ ఇది విరివిగా వాడే పద్ధతే. ఇంగ్లీషులో స్మిత్‌, బ్లేక్‌స్మిత్‌, గోల్డ్‌స్మిత్‌, టేలర్‌, రైట్‌ మొదలయినవి ఇటువంటి పేర్లే. బ్లేక్‌స్మిత్‌ అంటే కమ్మరి. గోల్డ్‌స్మిత్‌ అంటే కంసాలి. టేలర్‌ అంటే దర్జీ. రైట్‌ అంటే యంత్రాలతో పనిచేసే మనిషి; లేదా మెకానిక్‌. పార్సీలలో ఈ రకం పేర్లు ఇంజనీర్‌, కంట్రాక్టర్‌ మొదలయినవి విరివిగా కనిపిస్తాయి. మహారాష్ట్రులలో కూడ ఈ రకం పేర్లు ఎక్కువే. కర్మర్కర్‌, కరండికర్‌, మొదలయినవి.
నివసించే స్థలాన్ని ఇంటిపేరుగా వాడడం చాల చోట్ల ఉంది. ఈ స్థలం ఊరు పేరేనా కావచ్చు. మరొకటేదయినా కావచ్చు. ఇంగ్లీషులో పుంత పక్కని ఉన్న ఇంట్లో ఉన్నవాడిని “ఉడ్‌” అనీ మైదానానికి ఎదురుగా ఉన్న వాడిని “గ్రీన్‌” అనీ అనుంటారు. జవాహర్‌లాల్‌ నెహ్రూ అసలు ఇంటి పేరు కౌల్‌. కాశ్మీర్‌లో కాలవ పక్క ఇంట్లో ఉండి ఉంటారు. అందుకని కౌల్‌ కాస్తా “నహర్‌” గాను, అదే “నెహ్రూ” గానూ మారేయి.
బూర్గుల రామకృష్ణా రావు, పదకల్లు గ్రామంలో (కల్వకుర్తి తాలూకా, మహబూబ్ నగర్ జిల్లా), తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతని ఇంటిపేరు 'పుల్లంరాజు'. కొంతకాలం తరువాత అతను ఉంటున్న 'బూర్గుల' గ్రామంపేరుతో, 'బూర్గుల రామకృష్ణారావు' గా పిలవటం మొదలు పెట్టారు. ఆ ఇంటిపేరే స్థిరపడిపోయింది. చూ [[1]]
సినిమా రంగంలో అసలు పేరు తీసేసి తెర పేరు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. మేరిలిన్ మన్రో అసలు పేరు నార్మా జీన్స్. రాక్ హడ్సన్‌ అసలు పేరు లిరోయ్ హేరల్డ్ షేరర్‌. తెలుగు తారలలో మగవాళ్ళు తెర పేర్లు పెట్టుకోవటం తక్కువే కాని ఆడవాళ్ళు తెర పేర్లు వాడటం ఎక్కువే. వాణిశ్రీ ఒక ఉదాహరణ మాత్రమే. ఏ సినిమాలో అయితే పెద్ద పేరు వచ్చిందో ఆ సినిమా పేరు ఇంటిపేరుగా చలామణీ అయిన సందర్భాలు అనేకం. షావుకారు జానకి ఒక ఉదాహరణ మాత్రమే.
తెలుగు సంప్రదాయం
తెలుగు దేశపు సంప్రదాయం ప్రకారం ఇంటి పేరు పూర్వభాగం లోనూ, వ్యక్తివాచకం, అంటే పెట్టినపేరు, ఉత్తరభాగంలోనూ రాసుకోవడం సర్వసాధారణం. మిగిలిన భారతదేశపు ఆచారం తెలుగు దేశపు ఆచారానికి వ్యతిరేకం. చాలామంది పేరు ముందు, ఇంటిపేరు తర్వాత రాసుకుంటారు. ఇందిరా గాంధీ, ఆవిడ కొడుకు రాజీవ్‌ గాంధీ ఉదాహరణలు. ఇక్కడ ఇందిర, రాజీవ్‌ మొదలయిన మొదటి పేర్లు వ్యక్తి నామాలు. ఇంటిపేరయిన గాంధి ఆఖరి పేరు. కాని తెలుగుదేశంలో శ్రీరంగం సత్యనారాయణ మూర్తి అన్నప్పుడు ఇంటి పేరయిన శ్రీరంగం మొదటి పేరు అయింది. సత్యనారాయణమూర్తి అన్న పేరంతా ఒకే మాటలా రాసి, దానిని ఆఖరి పేరని తీర్మానించవచ్చు. లేదా, సత్యనారాయణ అన్న మాటని విడిగా రాసి, దానిని మధ్య నామంగా భావించి, మూర్తి అన్న మాటని ఆఖరి పేరుగా వాడుకోవచ్చు. ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావంచటం జరిగిందంటే తెలుగులో సత్యనారాయణమూర్తి అన్న అక్షరాలని ఒకే ఒక మాటగా రాసే శాల్తీలే అదే పేరుని ఇంగ్లీషులో రాసినప్పుడు సత్యనారాయణ అన్న అక్షరాలని ఒక మాట గానూ, మూర్తి అన్న అక్షరాలని మరొక మాట గానూ విడి విడిగా రాసి, పైపెచ్చు మూర్తి అన్న మాటని ఇంగ్లీషులోని పెద్ద బడిలోని అక్షరంతో మొదలు పెడతారు. అప్పుడు అమెరికా వాళ్ళ లెక్క ప్రకారం సత్యనారాయణ మధ్య పేరు, మూర్తి ఆఖరి పేరు అవుతాయి. ఈ సందర్భంలో ఈ శ్రీరంగం సత్యనారాయణమూర్తి అమెరికా వచ్చి ఉంటే శ్రీరంగం ఎస్‌. మూర్తి అవుతాడు.
విదేశ విశ్వవిద్యాలయాలలో ప్రవేశార్హత కొరకు దరఖాస్తు పెట్టే సమయంలో మొట్టమొదటి సారి పేర్లలోనూ, ఇంటిపేర్లలోనూ ఉన్న ధర్మసూక్ష్మాల అంతు ఏమిటో తేల్చుకోవాలని బుద్ధి చాలమందికి పుడుతుంది. అమెరికా దరఖాస్తు పత్రాలలో ”ఫస్ట్‌ నేమ్‌” ఏమిటి? “మిడిల్‌ నేమ్‌” ఏమిటి? “లాస్ట్‌ నేమ్‌” ఏమిటి? అని పుంఖానుపుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. కొందరు “గివెన్‌ నేమ్‌” అడుగుతారు. అంటే పెట్టిన పేరు అని అర్థం కనుక మనకి బారసాల నాడు పెట్టిన పేరే ఈ “గివెన్‌ నేమ్‌” అని తార్కికంగా ఆలోచించి తీర్మానించే లోగా, ఆ యూనివర్సిటీ వారు పక్కని కుండలీకరణాలు వేసి, వాటి మధ్య “ఇక్కడ నీ క్రిష్టియన్‌ పేరు రాయునది” అని అంటారు. క్రిష్టియన్స్‌ కానివాళ్ళ సంగతి? తరువాత్ “ఫేమిలీ నేమ్‌” ఏమిటి అని అడుగుతారు. “ఫేమిలీ నేమ్‌” అంటే కుటుంబ నామం. పక్కనే “ఇక్కడ నీ సర్‌నేమ్‌ రాయునది” అని సలహా ఉంటుంది. “సర్‌నేమ్‌” అంటే ఇంటిపేరు అని ఇంగ్లీషు వాడు చెప్పగా భారతీయులందరికీ తెలిసినదే కదా! “సర్‌నేమ్‌” (surname) అనే మాట ఎలా వచ్చిందో తెలుసా? లేటిన్‌ భాషలో “సర్‌” అంటే “ఊర్ధ్వ” అని కాని “కొసరు” అని కాని అర్థం చెప్పుకోవచ్చు. “సర్‌ప్లస్‌” (surplus) అన్న మాటలో ఈ కొసరు అనే అర్థమే స్ఫురిస్తుంది. కనుక “సర్‌నేమ్‌” అన్న మాటకి “కొసరుపేరు” అన్నది సరి అయిన తెలుగుసేత. ఈ లెక్కని రెడ్డి, శర్మ, శాస్త్రి, వర్మ, సెట్టి, నాయుడు, చౌదరి, మొదలయినవి కొసరు పేర్లుగా చలామణీ అయే సావకాశం ఉంది. కాని అవి అలా కావు. ఎందుకంటే వీటికి పట్టపు పేర్లు అని మరో పేరు ఉంది. "గివెన్ నేమ్" సంప్రదాయం మనవారిలో కూడా ఉంది.ఐతే అది ఏదైనా దీక్షను స్వీకరించినవారికి వర్తిస్తుంది. ఇటువంటివి శ్రీవిద్యా దీక్ష తీసుకొన్నవారిలో,సన్యాస దీక్ష తీసుకొన్నవారిలో కనిపిస్తుంది.త్రిపురానందనాథ,మదనానంద మొదలైనవి బారసాలనాడు పెట్టినవి కాకపోగా వారి దీక్ష సమయంలో పెట్టినవే.దీన్ని "మతనామం" అని అందామా? దీనికి దీక్ష నామమనే పేరు మొదలే ఉంది.
“గివెన్‌నేమ్‌” అన్నా, “క్రిష్టియన్‌నేమ్‌” అన్నా, బారసాల నాడు పెట్టిన పేరూన్నూ, “ఫేమిలీ నేమ్‌” అంటే ఇంటిపేరున్నూ. కాని “ఫస్ట్‌ నేమ్‌” కీ “లాస్ట్‌ నేమ్‌”కీ మధ్యనున్న తేడా అర్ధం అవటం కష్టం. “ఫస్ట్‌నేమ్‌” అంటే మొదట రాసుకునే పేరు. “లాస్ట్‌ నేమ్‌” అంటే ఆఖరున రాసుకునే పేరు. మధ్యలో వచ్చేవన్ని “మిడిల్‌ నేమ్స్". తార్కికంగా ఆలోచిస్తే చందూరి మాలతి అన్నప్పుడు చందూరి "ఫస్ట్‌నేమ్‌”, మాలతి “లాస్ట్‌ నేమ్‌” అవుతుంది. ఇదే పేరుని పాశ్చాత్య సంప్రదాయంలో మాలతీ చందూర్ అని రాసినప్పుడు పెద్దలు పెట్టిన పేరు "ఫస్ట్‌నేమ్‌” అవుతుంది, వంశపారంపర్యంగా వచ్చే పేరు “లాస్ట్‌ నేమ్‌” అవుతుంది. అంటే మనం పేరు రాసుకునే వరసని బట్టి ఈ పేర్లు ఏవేమిటో నిర్ణయించ బడతాయి.
అసలు తెలుగు వారికి ఈ మూడు నామాలతో పాటు మరొక నామం కూడా ఉందని చాలా మందికి తెలియదు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలయిన పేర్లలో పంతులు, రెడ్డి, చౌదరి అనేవి పట్టపు పేర్లు. ఇక్కడ గమనించవలసినది పంతులు అన్నది ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరులో ఉండుండదు; అది ప్రజలు గౌరవ సూచకంగా తగిలించి ఉంటారు. చౌదరి కూడ ఈ కోవకి చెందినదే. ఒకానొకప్పుడు రెడ్డి అనే పట్టపు పేరుని కూడ ఇలాగే పెద్ద కాపులకి వాడేవారు. దరిమిలా ఒకరు పట్టం కట్టే వరకు ఆగడం ఎందుకని అందరూ పేరులో ఒక భాగంగా పెట్టేసుకుంటున్నారని ఒక సిద్ధాంతం.
ఇప్పటికి ఇంటి పేరు, మధ్య పేరు, పెట్టిన పేరు, పట్టపు పేరు, కొసరు పేరు అయేయి కనుక ఇంకేమి పేర్లుంటాయని అనుకునేరు. ఈ పేర్లన్నిటితో పాటు వేడుక పేర్లు అంటే “నిక్‌ నేమ్స్‌”, ముద్దు పేర్లు అంటే “పెట్‌ నేమ్స్‌” వగయిరా చాలా ఉన్నాయి.
ఇలా ఇంటిపేరు ముందు, తర్వాత పెద్దవాళ్ళు పెట్టిన పేరు రాసుకునే అలవాటు ఒక్క తెలుగు వాళ్ళకే ఉండి ఉంటే “ఇదో తెలుగు తెగులు” అని సరిపెట్టుకోవచ్చు. కాని తమాషా ఏమిటంటే ఇదే అలవాటు జపాన్‌లోను, చైనా లోనూ కూడా ఉంది. అసలు జపాను వాళ్ళు తెలుగువారి లాగే ముందు ఇంటి పేరు, తర్వాత పెట్టిన పేరు, తర్వాత “గారు”కి బదులు “సాన్‌” అని గౌరవ వాచకం తగిలించి వాడతారు. చైనాలో పద్ధతి దరిదాపు ఇదే. చైనా చరిత్ర చదివిన వారికి “సన్‌ యట్‌ సెన్‌” అన్న పేరు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇందులో “సన్‌” అన్నది ఇంటిపేరు. “మావ్‌ జేడుంగ్‌”లో “మావ్‌” ఇంటిపేరు. “జో ఎన్‌లై”లో “జో” ఇంటిపేరు.
కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడ ఒంగి, లొంగిపోయి, పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు చివర రాయడం ఈ మధ్యే మొదలు పెట్టేరు. కాని కల్చరు పేరు మీద కొట్టుకు కోర్టుకెక్కే తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా? హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా తెలుగువారు మాత్రం వి. వి. రావ్‌, పీ. కే. మూర్తి, యన్‌. టీ. రామారావు అనే రాస్తాం తప్ప, మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం. అసలు యన్‌. టీ. రామారావుని “యన్టీయార్‌” అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామారావ్‌ టీ. నందమూరి అంటే వస్తుందా? తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు.
కొంతమంది తమ తమ ఇంటి పేర్లు శ్రవణరంజకంగా లేవనిన్నీ, అశ్లీలార్థకాలనిన్నీ, నైచ్యార్థకాలనిన్నీ భ్రమపడో, భయపడో చెప్పడానికి ఇష్టపడరు. బొక్కా, ముష్టి, ముట్లూరు, సూద్నగుంట మొదలైనవి ఈ జాతివి. అలాగని ఎన్నాళ్ళు ఇంటిపేరు చెప్పకుండా ఉండగలరు? అందుకని కొందరు ఇంటిపేరుని సాధుసభా సమ్మతంగా ఉండేటట్లు మార్చేసుకుంటారు. ఈ ధోరణిలోనే ముట్లూరు కాస్తా ముట్నూరు గా మారి ఉండవచ్చు. బొక్కా వారు భారతం వారుగా పరిణమించి ఉండొచ్చు.
పేరుని బట్టీ, ఇంటి పేరుని బట్టీ కులం ఏమిటో, ఒకే కులంలో శాఖ ఏమిటో, గోత్రం ఏమిటో కూపీ లాగడం అంత తేలికయిన పని కాదు. పేర్లకి అయ్య, మూర్తి, రావు, స్వామి మొదలైన ప్రత్యయాలని (వీటినే పట్టపు పేర్లని అంటారని చెప్పటం జరిగింది) చేర్చినప్పుడు పేరుని బట్టి ఏ కులమో చెప్పడం కష్టం. శాస్త్రి, శర్మ, రెడ్డి, చౌదరి, నాయుడు మొదలయిన ప్రత్యయాలని బట్టి కులం తెలుసుకోవచ్చు. కాని ఈ చిటకా అన్ని సందర్భాలలోనూ పని చెయ్యదు. రెడ్డిశాస్త్రి ఎవరు? పి. యల్‌. సంజీవరెడ్డి ఐ.ఎ.ఎస్‌. గారు రెడ్లు కాదు; కమ్మవారు. అలాగే కర్రా అన్న ఇంటి పేరు బ్రాహ్మణులలో ఉంది, మాల కులంలో ఉంది. కడియాల అనే ఇంటిపేరు కమ్మవారిలో ఉంది, బ్రాహ్మణులలో ఉంది. వేమూరి అనే ఇంటిపేరు బ్రాహ్మణులలో, కమ్మ వారిలో, హరిజనులలో ఉంది. గొర్తివారు కాపులలో ఉన్నారు, బ్రాహ్మణులలో ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇంటి పేర్లు ఎక్కవగా ఊరు పేరుని బట్టి, వంశంలో ప్రముఖ వ్యక్తి పేరుని బట్టి ఏర్పడతాయి కనుక ఒక కులంలో ఉన్న ఇంటి పేరు మరొక కులంలో కూడా ఉండవచ్చు.
సూరపనేని, రామినేని, అక్కినేని, త్రిపురనేని మొదలైన “నేని” శబ్దంతో అంతమయే వన్నీ సర్వసాధారణంగా కమ్మవారి ఇంటిపేర్లు. ఈ “నేని” అన్న మాట “నాయుడు” అన్న మాటకి రూపాంతరం. ఈ “నాయుడు” అనేది “నాయకుడు” కి క్లుప్తరూపం. నేని అంటే నాయుని సంక్షిప్తరూపం(నాయుని:నాయుడు యొక్క) కనుక రామినేని అచ్యుతరావు అంటే రామినాయుడి అచ్యుతరావు అన్నమాట.
తండ్రిపేరుని వ్యక్తి వాచకాలకు తగిలించే పద్ధతిలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఊళ్ళో ఊళ్ళో అయితే శ్రీనివాసన్‌ కొడుకు జయరామన్‌ అంటే పనిచేస్తుంది కాని, పొరుగూరు వెళితే ఆ శ్రీనివాసన్‌ ఎవరో అందరికీ తెలియక పోవచ్చు కనుక అంతగా ఉపయోగించదు. అప్పుడు పేరుతో పాటు స్వగ్రామం పేరు జోడించి లాల్‌గుడి జయరామన్‌ అని చెప్పడం ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. తెనాలి రామకృష్ణ మరో ఉదాహరణ.

Comments