ఆటో వాల

రవాణా రంగంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఆటోవాలాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నిత్యం పోలీసుల వేధింపులు భరిస్తూ జీవనయానం సాగించాల్సి వస్తోంది. తమ సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో అఖిలభారత సమావేశాలు జరుగుతున్నాయి.

రైళ్లు, బస్సుల తో పాటు రవాణా రంగంలో ఇవాళ ఆటోలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి . నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆటోలు పరుగులు తీస్తున్నాయి. కొన్ని లక్షల మంది గ్రామీణ, పట్టణ యువతకు ఆటోలు ఇప్పుడు జీవనోపాధిగా మారుతున్నాయి. పీజీలు, పీహెచ్ డీలు చేసినవారు కూడా ఆటోలు నడుపుతున్న ద్రుశ్యం ప్రతి చోటా కనిపిస్తోంది. గంటల తరబడి సిటీ బస్సుల కోసం, రూరల్ బస్సుల కోసం ఎదురుచూసి విసిగిపోయినవారికి షేరింగ్ ఆటోలు వరంగా మారాయనడంలో అతిశయోక్తి లేదు. నష్టాలు వస్తున్నాయన్న పేరుతో ఆర్టీసీ సర్వీసులు నిలిపివేసిన ప్రాంతాల్లో సైతం ఆటోవాలాలు ప్రజలకు తమ సేవలు అందిస్తుండడం మనం చూస్తున్నదే. ఇటు లక్షలాది మందికి ఉపాధి చూపిస్తూఅటు ప్రజల రవాణా అవసరాలు తీరుస్తున్న తమను ప్రభుత్వం సేవా రంగంగా గుర్తించడం లేదన్న ఆవేదన ఆటో రంగంలో వ్యక్తమవుతోంది.

ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో దాదాపు ఆరు లక్షలకు పైగా ఆటోలు తిరుగుతుంటే, హైదరాబాద్ లోనే వీటి సంఖ్య లక్షన్నరదాటింది.  తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రెండున్నర నుంచి మూడు లక్షల ఆటోలు తిరుగుతున్నాయని అంచనా. అంటే ఒక్క తెలుగు నేల మీదే దాదాపు పది లక్షల కుటుంబాలకు ఆటోలు ప్రధాన ఆదాయవనరుగా మారాయి.
ఈ గణాంకాలు చాలు రవాణారంగంలో ఆటోలు పోషిస్తున్న పాత్రను అర్ధం చేసుకోవడానికి. రేయింబవళ్లు కష్టపడ్డా ఇంటిల్లిపాది కడుపు నిండా బువ్వ తినలేని పరిస్థితి అనేక కుటుంబాలది. దీనికి తోడు పోలీసులు వేసే చలానులు, వేధింపులు వారి జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తున్నాయి.  సిగ్నల్ జంపింగ్ , రాష్ డ్రైవింగ్ రాంగ్ పార్కింగ్  ఒన్ వే వంటి కారణాలతో  పోలీసులు నిత్యం జేబులకు చిల్లు పెడుతున్నారన్నది ఆటో డ్రైవర్ల ఆవేదన.

ట్రాఫిక్, ఆర్టీఏ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులు సైతం తమను వేధిస్తున్నారనేది ఆటో డ్రైవర్ల ఫిర్యాదు. ఇన్ని రకాల బాధలు భరిస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి తమకు దక్కాల్సిన సౌకర్యాలేవీ దక్కడం లేదన్న ఆవేదన ఆటో డ్రైవర్లు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆటోలు కొనుగోలుకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు  , వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. కానీ , కొంతకాలంగా ఇలాంటి రుణాలు నిలిపివేయడంతో ప్రయివేట్ ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. అధిక వడ్డీల భారాలు మోయాల్సి వస్తోంది. శ్రీరాం ఫైనాన్స్, అశోక్ లేలాండ్, ఐకెఎఫ్, మహేంద్ర అండ్ మహేంద్ర, బజాజ్ ఫైనాన్స్, కనకదుర్గా లీజింగ్ లాంటి కంపెనీలు రుణాలు అందిస్తున్నా, కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఆటో డ్రైవర్లతో వ్యవహరిస్తున్న తీరుపై అనేక ఆరోపణలున్నాయి. అనారోగ్యం వల్లనో, అనుకోని ఖర్చుల వల్లనో, ఆదాయం చాలకో ఏ కారణం చేతనైనా ఒకట్రెండు నెలలు కిస్తీలు కట్టకపోయినా, ఆటోలు లాక్కెళ్తున్నారన్నది ఆటోవాలాల ఆవేదన . గతంలో మాదిరిగా ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పిస్తే ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలకు అధిక వడ్డీలు కట్టాల్సిన దౌర్భాగ్యం తప్పుతుందని  ఆటోడ్రైవర్లంటున్నారు.

ఇక ఆటోవాలాలు ఎదుర్కొంటున్న మరో సమస్య గ్యాస్.  కాలుష్యం పెరుగుతుందన్న కారణంతో ప్రభుత్వం సీఎన్ జీ ఆటోలు వాడుకలోకి వస్తున్నాయి. సీఎన్ జీ ఆటోలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వాలు వాగ్ధానం చేయడంతో అనేకమంది డీజీల్ ఆటోలు నడిపినవారు వాటిని అమ్మేసి సీఎన్ జీ ఆటోలు కొనుగోలు చేశారు. ప్రారంభంతో కిలో సీఎన్ జీ గ్యాస్ ధర 16 రూపాయలు వుండగా, ఇప్పుడది 53 రూపాయలకు చేరింది. ఆటోల సంఖ్యకు తగ్గట్టుగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడంతో డ్రైవర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.  ఒక్కొక్కసారి గంటల తరబడి బంక్ ల ద్వారా క్యూ కట్టాల్సి వస్తోంది. బంక్ ల నిర్వాహకులు నిర్ణీత ధర కంటే అధికంగా డిమాండ్ చేసిన నోరుమెదపలేని దైన్య స్థితిలో చిక్కుకున్నారు సీఎన్ జీ ఆటోలు నడిపేవారు.

ఆటో రంగాన్ని సేవా రంగంగా గుర్తించాలనీ, ఆటోల్లో వాడే ఇంధనానికి సబ్సిడీ ఇవ్వాలనీ, ఆటో కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలనీ, పోలీస్  వేధింపుల నుంచి రక్షణ కల్పించాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలన్నది ఆటోవాలాల డిమాండ్.


 ===రమిజం

Comments